11 July, 2013

చిన్నోడా...
వరినాటడానికి
మేం మడికాడికెల్తాండం.  
సద్దెన్నెంతీసకరారా!  
   
లేదయ్యా..
నేచదువుకోవాల.  

చిన్నోడా..
నాకు విపరీతమైన మోకాల్లనొప్పులు.
కనికెల్లదాకావెల్లి
మడికి మడవపెట్రానాయనా!    
 
లేదయ్యా!
నేరాసుకొవాల!

చిన్నోడా...
వరికోతకొచ్చింది
బడిచాలీరా నాల్గురోజులు
నీకుపుణ్యముంటది.
 
లేదయ్యా..
మాకిపుడు పరీచ్చలు పెడ్తాండ్రు.

ఛిన్నోడా..
దేశంకాని దేశం
ఎపుడొస్తావో ఏమోరా!  

లేదయ్యా!
ఏడాదికల్లా తిరిగొస్తాను!

ఎడాది దాటింది
స్వదేశానికొచ్చాను.
రచ్చబండమద్య నిటారుగా నిలబడి  
ఊరికి హుషారుగా
కాపలాకాసే...
ఆ చింతచెట్టు మౌనంగా
చింతిస్తున్నట్లుంది.
అర్థమయ్యింది  
"చిన్నోడా..! చిన్నోడొచ్చాడా..!
అని మనషుల్ని, చెట్లని, పుట్లని అడిగే  
అయ్యమాత్రం ఇకలేడని".

నా రోదనల రోదసిలో
మరోవిషాదవిశ్వవిస్పొటనం.