26 January, 2013

ఎవరో ఈ విశ్వశిల్పాన్ని మలిచి
ఏ విశ్వంపైనో.. ప్రతిష్టించారు.
మహాశిల్పులకు సైతం
మతిపోవునట్లు.
యుగాల అగాధాలు ప్రవహించినా
శిల్పం శిథిలమవ్వలేదు.
ఎంత చింతించినా.. ఎంత శోధించినా
శిల్పిజాడ తెలియలేదు.          
 
ఎవరో మధురాతి మధురంగా
ఆది, అంతం లేకుండా
జీవనగానాన్ని ఆలపిస్తున్నారు.
అమావాస్యరాత్రి సైతం
కలువలు వికసించెటట్లు.
యుగాల సవ్వడులు అడ్డుపడినా
గానం ఆగలేదు
ఎంత చింతించినా.. ఎంత శోధించినా
గాయకుని అడుగులు కనపడలేదు.

ఎవరో ఈ విశ్వవృక్షం క్రింద కూర్చుని
విశ్వాన్ని శ్వాసిస్తున్నారు,
శాసిస్తున్నారు.
ఎంత చింతించినా.. ఎంత శోధించినా
ఆ రూపం కనపడలేదు
ఆ శ్వాస వినపడలేదు.