16 March, 2013


మాఘమాసం..
మహాశివరాత్రి...
పితృదేవతారాధన..
కన్నీరుకురిసిన రాత్రి.

నాడు
చింతచెట్టుకింద
రచ్చబండపై కూర్చుని
నిరంతరం నా రాకకై
చింతించిన మనిషి,
పదిమంది నన్ను పొగడగనే
పుత్రోత్సాహంతో పొంగిపోయిన మనిషి,
నేడు వూరికి దూరంగా
చితిలొ నివాసముంటున్నాడు.
సూర్యోదయం నుంచి 
సూర్యాస్తమయం వరకు
ఎంతబ్రతిమాలినా…
నా భాగోగులు వినడు 
తన భాగోగులు చెప్పడు.

నా పాదాలు కందిపోతాయేమోనని
తన భుజాలన ఎక్కించుకుని
బడిదాక మోసుకెల్లిన మనిషి,
అన్నం తీసుకెల్లననిజెప్పి
అలిగి నేను బడికెల్తే..
బడిదాక నడిచివచ్చి
నన్ను బ్రతిమాలే మనిషి,   
వెన్నెల్లో హలాన్నిబట్టి
పొలందున్నిన మనిషి,
మట్టిని మత్రించి 
మానిక్యాలుగా మార్చిన మనిషి
నేడు వూరికి దూరంగా
చితిలొ నివాసముంటున్నాడు.
సూర్యోదయం నుంచి 
సూర్యాస్తమయం వరకు
ఎంతబ్రతిమాలినా
నా భాగోగులు వినడు 
తన భాగోగులు చెప్పడు.

శివుడా!
అద్యంతంలేని ఈవిశ్వంలో
ఆదిఎందుకు?
అంతమెందుకు?
అంతులేని దుఃఖమెందుకు?